మిల్క్ ఎనలైజర్ల లైసెన్సు, సేకరణ కేంద్రాల నమోదు
మిల్క్ ఎనలైజర్ల లైసెన్సు, పాల సేకరణ కేంద్ర నమోదుకు ఉద్దేశించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ఈ చట్టం కారణంగా పాడి రైతులక తక్షణమే ప్రయోజనం చేకూరుతుందని, గిట్టుబాటు ధరలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పాల సేకరణ కేంద్రాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ఎనలైజర్లతో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్, నీటి పరిమాణం ప్రమాణాల నిర్ధారణలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, నిబంధనలను ఉల్లంఘిస్తే పాల సేకరణ కేంద్రాల నమోదును రద్దు చేయొచ్చని తెలిపింది.
వివిధ పద్దులకు ఏపీ శాసనసభ ఆమోదం: పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, కార్మిక, దేవాదాయ ధర్మాదాయ, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పరిశ్రమలు, సమాచార సాంకేతికత, పర్యాటక శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పద్దులకు సభ ఆమోద ముద్ర తెలిపింది. ఉప ముఖ్యమంత్రులు కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్, జయరాం, గుడివాడ అమర్నాథ్, రోజా వీటిని ప్రవేశపెట్టగా చర్చల అనంతరం వీటికి సభ ఆమోదం తెలిపింది.
డాక్యుమెంట్లు రద్దు చేసే అధికారంపై సవరణ బిల్లుకు ఆమోదం
నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను జిల్లా రిజిస్ట్రార్లు విచారణ జరిపి రద్దు చేసే అధికారాన్ని కల్పించే సవరణ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి చెందినది కావడంతో ఈ సవరణ బిల్లు ఉభయ సభల ఆమోదం తర్వాత కేంద్రానికి పంపనున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు, గ్రంథాలయాల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఆలయాల ట్రస్ట్ బోర్డుల్లో ఒక సభ్యుడిగా నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారి నియామకం, మైనార్టీ, బీసీ కమిషన్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని రెండేళ్లకు తగ్గింపు, బార్ అసోసియేషన్ల ఉమ్మడి ఉప-నిబంధనావళిని పాటించడం తప్పనిసరి చేస్తూసవరణ బిల్లు, పాల ప్రమాణాలకు చెందిన సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది.
మద్యం కేసుల్లో రాజీకి వీలు కల్పిస్తూ చట్ట సవరణ బిల్లులను ఆమోదించిన శాసనసభ
మద్యం కేసుల్లో రాజీకి వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లుల్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. తొలిసారి నేరానికి పాల్పడిన వారు చట్టంలో పేర్కొన్న నిర్దేశిత జరిమానా చెల్లించి కేసును పరిష్కరించుకోవచ్చు. ఈ కేసుల్లో జప్తు చేసిన వాహనాలు, ఆస్తులకు సంబంధించి అధికారులు నిర్ధారించిన విలువ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి వాటిని తిరిగి పొందొచ్చు. అయితే ఆ కేసులు తీవ్రత లేనిపై ఉండాలి. వాటిని ఎదుర్కొంటున్న నిందితులు తక్కువ పరిమాణం గల మద్యంతో దొరికి ఉండాలి. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి ఆంధ్రప్రదేశ్ అబ్కారీ చట్టం-1968 సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ మద్యనిషేధ చట్టం-1995 సవరణ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టారు. వాటిని సభ ఆమోదించింది.
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************