Telugu govt jobs   »   Study Material   »   Bhoodan Movement in Telangana

Bhoodan Movement in Telangana, Download PDF, TSPSC Groups | తెలంగాణలో భూదాన ఉద్యమం, డౌన్‌లోడ్ PDF

తెలంగాణాలో భూదాన ఉద్యమం: భారతదేశ చరిత్రలో భూమికి చాలా ప్రాధాన్యత ఉంది. రాచరిక వ్యవస్థలో ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. రాజ్య ఆదాయానికి భూమి శిస్తే ముఖ్య ఆధారంగా ఉండేది. నేటి ఆధునిక కాలంలో కూడా భారతదేశ ఆర్థికవ్యవస్థ వ్యవసాయంపై భారపడి ఉంది. అయితే 20వ శతాబ్దం మధ్య భాగంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో హింసాయుత పోరాటాలు జరిగాయి. ఈ క్రమంలోనే అహింసాపద్ధతిలో భూదానోద్యమం పుట్టింది.

భూదానోద్యమాన్ని మహాత్మాగాంధీ ముఖ్య శిష్యుడైన వినోబాభావే తెలంగాణాలో ప్రారంభించారు. ఆయన తన దయాత్ర ద్వారా తెలంగాణ మొత్తం పర్యటించి కొన్నివేల ఎకరాల భూమిని భూస్వాముల దగ్గర నుంచి దానంగా భూమిలేని పేదలకు పంచాడు.

Telangana History PDF

తెలంగాణాలో వినోబాభావే పర్యటన – భూదానోద్యమ పుట్టుక

  • తెలంగాణాలోని నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టుల హింసాత్మక భూపోరాటాలు, అశాంతి గురించి విన్న వినోబాభావే తాను తెలంగాణాలో ఒక శాంతి సైనికునిగా పర్యటిస్తానని ప్రకటించాడు.
  • సర్వోదయ సమితి సమావేశానంతరం తన తెలంగాణా పర్యటనను ప్రారంభించాడు. ఆయన యాత్ర 1951 ఏప్రిల్ 15న శివరాంపల్లి నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట డా॥ మెల్కోటే, డా॥ మర్రిచెన్నారెడ్డి మొదలైన వారున్నారు.
  • ఏప్రిల్ 18న హయత్ నగర్ లోను, 17న బాటసింగారంలోను బసచేసారు. ఏప్రిల్ 18న ఉదయం 9 గంటలకు వినోబాభావే బృందం నల్లగొండ జిల్లా భువనగిరి తాలూకా పోచంపల్లికి చేరింది.
  • ఈ గ్రామం కమ్యూనిస్టు కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ఉండేది. వినోబాభావే గ్రామంలోకి ప్రవేశించగానే ముందుగా హరిజనవాడను సందర్శించాడు. అక్కడ ఉన్న కొందరు హరిజనులు తమకు కొంత భూమిని ఇప్పించమని కోరారు.
  • ఈ హరిజనులు అడిగే భూమి ఎవరైనా భూస్వాములు ఇవ్వగలరా అని గ్రామస్థులను ప్రశ్నించాడు. దీంతో ఆ గ్రామానికి చెందిన వెదిరే రామచంద్రారెడ్డి అనే భూస్వామి లేచి 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.
  • రామచంద్రారెడ్డి అప్పుడే దానపత్రాన్ని రాసి వినోబాభావేకు ఇచ్చాడు. ఈ విధంగా భూదానోద్యమం పుట్టింది.
  • తన పర్యటనలో వినోబాభావే భూస్వాములకు విజ్ఞప్తి చేస్తూ మీ భూమిలో 1/6వ వంతు భూమిని భూమిలేని వారికి దానం చేయమని పలికాడు.
  • వినోబాభావే పాదయాత్ర ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగింది. కొన్నివేల ఎకరాల భూమి భూదానంగా లభించింది.
  • 1951, జూన్ 7 న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల్లోని సర్వోదయాశ్రమంలో హైదరాబాద్ స్టేట్ సర్వోదయ కార్యకర్తల సమ్మేళనం జరిగింది. ఒక లక్ష ఎకరాల భూమిని సేకరించడానికి ఈ సభలో సంకల్పించాడు.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

భూదాన యజ్ఞసమితి

  • దానంగా వచ్చిన భూమిని పంచడానికి, ఆ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి 1951 జూన్ 7న వినోబాభావే భూదాన యజ్ఞసమితిని ఏర్పాటుచేశాడు.
  • ఈ భూదాన యజ్ఞ సమితి కన్వీనర్ గా ఉమ్మెత్తల కేశవరావు, సభ్యులుగా కేతిరెడ్డి కోదండరాం రెడ్డి, సంగం లక్ష్మీబాయిలను నియమించాడు.
  • అక్కడ జరిగిన సమావేశానికి హైదరాబాద్ రాష్ట్ర రెవెన్యూ మంత్రి బి. రామకృష్ణారావు హాజరయి భూముల పంపకానికి సంబంధించిన చట్టాలను రూపొందిస్తామని ప్రకటించాడు.
  • తరవాత హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 1951 వ సంవత్సరం భూదానానికి సంబంధించిన చట్టాన్ని ప్రకటించింది.
  • 1951 జూన్ 14న రాజూర గ్రామం ద్వారా వినోబా హైదరాబాద్ రాష్ట్రాన్ని వదలివెళ్ళాడు.

Telangana State Formation – Movement

తెలంగాణలో భూదాన ఉద్యమం – వినోబాభావే రెండవ పాదయాత్ర

  • 1955 డిసెంబర్ లో వినోబాభావే భూదానోద్యమ రెండవ యాత్ర ఖమ్మం జిల్లా ముత్తుగూడెం నుంచి ప్రారంభమైంది.
  • అక్కడ నాటి హైద్రాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు, రామానంద తీర్థతోపాటు అనేకమంది సర్వోదయ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.
  • 1956 జనవరి 2న వినోబా ఖమ్మం జిల్లా కల్లూరుకు చేరుకొన్నాడు.
  • హైదరాబాదు చివరి నిజాం, వినోబాభావే మొదటి భూదాన యాత్ర సందర్భంలో 3500 ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడు. ప్రస్తుత యాత్రలో ఆయన సంపత్తి దానం చేశాడు. హైదరాబాద్ సాలార్జంగ్ ఎస్టేట్ కమిటీ వారు 35 ఎకరాల భూమిని, 25000 రూపాయలను వినోబాభావేకు అందచేశారు.
  • ఫిబ్రవరి 8న వినోబా పాల్మాకోల్ గ్రామానికి చేరుకొన్నప్పుడు భారత రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ వచ్చి వినోబాభావేను కలుసుకుని 3 గంటలు యాత్రలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు.
  • నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ వినోబాభావేను మార్చి 5 న మాధవరావు పల్లెలో కలుసుకొని 90 నిమిషాలు చర్చలు జరిపాడు. ఆ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 35 కోట్లమంది భారతీయులకు ప్రధానమైన సమస్య భూమి అని, భూదానోద్యమానికి తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నాడు.
  • వినోబాభావే తన రెండో భూదాన యాత్ర ద్వారా  42,000 ఎకరాలను భూదానంగా పొందాడు.
  • వినోబాభావే తెలంగాణ యాత్ర తరవాత అనేకమంది భూస్వాములు భూదాన యజ్ఞ బోర్డుకు భూదానాలు చేశారు. భూదానం ద్వారా వచ్చిన భూమిని 1996 వరకు భూదాన యజ్ఞ బోర్డు భూమిలేని వారికి పంపిణీ చేసింది.

Telangana Geography  

 భూదానోద్యమం పట్ల కమ్యూనిస్టుల వైఖరి

  • తెలంగాణాలో భూదానోద్యమం ప్రారంభమైన వెంటనే కమ్యూనిస్టులు దాన్ని వ్యతిరేకించారు. అప్పటికే అనేకమంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలను పణంగాపెట్టి భూస్వాములకు వ్యతిరేకంగా పేద ప్రజలకు భూములిప్పించడం కోసం పోరాడుతున్నారు.
  • ప్రభుత్వం వినోబాభావే భూదానోద్యమం ద్వారా వ్యవసాయ యోగ్యంకాని భూములను పంచుతూ ప్రజల నమ్మకాన్ని చూరగొనడానికి ప్రయత్నిస్తుంది అని ఆరోపించారు.
  • కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య రచించిన గ్రంథమైన “వీర తెలంగాణ విప్లవ పోరాటం -గుణపాఠాలు”లో భూదానోద్యమం గూర్చి కింది విధంగా పేర్కొన్నాడు.
    • “రైతు పోరాటాలు జరుగుతున్న సమయంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వం వినోబాభావేను ముందుకు తీసుకువచ్చింది. వినోబాభావే మనస్సులో నుంచి పుట్టుకొచ్చిందే ఈ భూదానోద్యమం. భూస్వాములు, బూర్జువాల హామీలను, తీయటి మాటలను వింటే భూ సమస్యకు ఎప్పటికీ పరిష్కారం లభించదు. ప్రజల ఐకమత్యంతో బలమైన ప్రజాపోరాటాలు చేసినప్పుడే దీనికి పరిష్కారం లభిస్తుంది”.
  • కొంతమంది వినోబాభావేను “సర్కారి సాధు” అన్నారు. అరుణా అసఫ్ అలీ 1951 అక్టోబరు 24న ఆగ్రాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వినోబాభావేను క్యాపిటలిస్టుల ఏజెంట్ గా అభివర్ణించారు.

Download Bhoodan Movement in Telangana PDF

Telangana Study Materials
Telangana Economy (తెలంగాణ ఎకానమీ)
Telangana Government Schemes (తెలంగాణ ప్రభుత్వ పధకాలు)
Telangana Current Affairs (తెలంగాణ కరెంటు అఫైర్స్)

 

TSPSC GROUP-2, GROUP-3 General Studies Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

భారతదేశంలో భూదాన్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?

వినోబా భావే భూదాన్ ఉద్యమ పితామహుడు.

తెలంగాణ లో భూదాన్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది ?

తెలంగాణ లో భూదాన్ ఉద్యమం 1951లో గాంధేయవాది వినోబా భావే పోచంపల్లి గ్రామంలో పోచంపల్లిలో ప్రారంభించారు.

తెలంగాణ లో భూదాన్ ఉద్యమం లో మొదటి భుదాత ఎవరు?

పోచంపల్లికి చెందిన వెదిరే రామచంద్రారెడ్డి అనే భూస్వామి లేచి 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.