Telangana Is The Third State With The Lowest Maternal And Child Mortality | మాత శిశు మరణాలు తక్కువగా ఉన్న మూడవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది
మాతా శిశు సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, మాతాశిశు మరణాల రేటు తక్కువగా ఉన్న మూడో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు ఉద్ఘాటించారు. మాతాశిశు మరణాలను గణనీయంగా తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి, ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికే దక్కుతుందని పేర్కొన్నారు. తల్లి మరణాలు గతంలో ప్రతి లక్షకు 92 ఉంటే అవి ఇప్పుడు 43కు తగ్గాయని, బిడ్డ మరణాలు 39 నుంచి 21కి తగ్గాయని తెలిపారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.52 కోట్లతో నిర్మించిన మదర్ చైల్డ్ హెల్త్ (MCH) కేర్ సెంటర్‌తో పాటు రూ.2.70 కోట్లతో ఏర్పాటు చేసిన డైట్ క్యాంటీన్ భవనాలను, జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనెటల్ అంబులెన్స్ సర్వీసులను ఆగష్టు 20 న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో కలిసి హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై నెలలో 72.8 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 350 ప్రసూతి కేంద్రాల ఆధునికీకరణ చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ లోని గాంధీ, పేట్లబురుజు ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
గాంధీలో సూపర్ స్పెషాలిటీ MCH కేర్ సెంటర్
మాతాశిశు మరణాలను ఎదుర్కోవడానికి గాంధీ, నిమ్స్, టిమ్స్ (అల్వాల్)లో మొత్తం 600 పడకల సామర్థ్యంతో మూడు ఎంసీహెచ్ కేర్ సెంటర్లకు అనుమతి లభించిందని హరీశ్ రావు వెల్లడించారు. ముఖ్యంగా, గాంధీ హాస్పిటల్‌లో సూపర్ స్పెషాలిటీ MCH కేర్ సెంటర్ ఆగస్టు 20 నుండి కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్‌లో మాతా మరియు శిశు సంరక్షణ కోసం 500 మంది వ్యక్తులకు వసతి కల్పించడం జరిగిందని ఆయన నొక్కి చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన 300 అమ్మవడి వాహనాల ద్వారా రోజుకు 4 వేల మంది గర్భిణులకు సేవలందిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఆధునిక సౌకర్యాలతో నియోనెటల్ అంబులెన్స్‌లు
పుట్టిన ప్రతి శిశువును ప్రాణాలతో కాపాడుకునేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనెటల్ అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చామని హరీశ్ రావు చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ అంబులెన్సులు అత్యవసర సమయాల్లో నవజాత శిశువులను ఆస్పత్రులకు తరలించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు వాణీదేవి, మీర్జా రహమత్ అలీబేగ్, ఎస్‌ఏఎం రిజ్వీ (వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి), జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************