భారత్‌లోనే గాకుండా ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్రాల రంగంలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. గత ఏడాది కాలంలో తెలంగాణలో ఈ రంగం 200 శాతం అభివృద్ధి సాధించిందని, 215 పరిశ్రమలతో రూ.6,400 కోట్ల పెట్టుబడులను సమీకరించిందని వెల్లడించారు. 34 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయన్నారు. హైదరాబాద్ వేదికగా బయో ఆసియా 19వ అంతర్జాతీయ సదస్సును కేటీఆర్ గురువారం దృశ్యమాధ్యమంలో ప్రారంభించి ప్రసంగించారు. ఏటా బయో ఆసియా సదస్సులో ఇచ్చే జినోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారాన్ని ఈసారి అమెరికాలో ఉన్న పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పిరల్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధిపతి ప్రొఫెసర్ డ్రూ వైస్మాన్‌కు మంత్రి సమర్పించారు. తర్వాత వైస్మాన్‌తో అపోలో ఆసుపత్రుల ఎండీ సంగీతారెడ్డి చర్చాగోష్ఠి నిర్వహించారు. మొత్తం నాలుగు అంశాలపై గోష్ఠులు జరిగాయి. సాయంత్రం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో మంత్రి కేటీఆర్ నిర్వహించిన చర్చాకార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తొలిరోజు బయో ఆసియా సదస్సును మూడున్నర లక్షల మందికిపైగా దృశ్య మాధ్యమంలో తిలకించారు. ప్రారంభోపన్యాసంలో కేటీఆర్ మాట్లాడుతూ.. దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు కొవిడ్ టీకాల్లో రెండు (కొవాగ్జిన్, కార్బెవ్యాక్స్) హైదరాబాద్‌కు చెందినవే కావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ‘‘జీవశాస్త్రాల రంగానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మరింత అభ్యున్నతిని సాధిస్తుంది. భారతీయ కంపెనీలు.. జనరిక్ ఔషధాలు, సమ్మిళిత జనరిక్స్, బయోసిమిలర్స్, బయోలాజిక్స్, సెల్, జీన్ థెరపీ, క్లినికల్ పరిశోధన వంటి రంగాల్లో మరింత బలపడాలి. ప్రపంచస్థాయిలో నిలిచేందుకు భారత సంస్థలు పోటీ పడాలి. వ్యాల్యూ చైన్ వృద్ధికి సంస్థలు, ప్రభుత్వాలతో కలిసి పని చేయాలి. జీవశాస్త్రాలు, ఔషధరంగాలకు తెలంగాణలో చక్కటి అనుకూల వాతావరణం ఉంది. జీనోమ్‌వ్యాలీ వెన్నెముకగా నిలుస్తోంది. కొత్తగా ప్రారంభమయ్యేవే గాక ప్రస్తుతం ఉన్న ప్రతీ సంస్థ విస్తరణ చేపట్టడం రాష్ట్ర పారిశ్రామిక విధానాలపై నమ్మకానికి నిదర్శనం. వైద్యపరికరాల ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మరో ఆరు నెలల్లో ఏడు కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 50కి పైగా సంస్థలు వైద్య పరికరాల తయారీ, పరిశోధన అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాయి. వీటి ద్వారా 7వేల మందికి ఉపాధి కలిగింది. త్వరలో మరికొన్ని సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తాయి.
********************************************************************************************