Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Supreme Court rules on 1,654 acres...

1,654 ఎకరాలు ప్రభుత్వానివే, మణికొండ జాగీర్‌ భూములపై సుప్రీం కోర్టు తీర్పు

హైదరాబాద్‌ మహానగరం మణికొండ జాగీర్‌ పరిధిలోని 1654.32 ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర సర్కారు చూపిన చొరవను ధర్మాసనం ప్రశంసించింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం వెలువడిన తీర్పుతో తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఉమ్మడి రాష్ట్ర హయాంలో అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయించిన ల్యాంకో హిల్స్‌, జనచైతన్య హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, టీఎన్జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీ, ఐఎస్‌బీ సహా పలు సంస్థలు, వ్యక్తులకు ఊరట లభించింది.

వివాదం మొదలైందిలా..

మణికొండ జాగీర్‌ పరిధిలోని ముతావలీ ఇల్లు, భూమి కలిపి 5,506 చదరపు గజాలు తమ పరిధిలోనిదంటూ ఏపీ వక్ఫ్‌బోర్డు 1989, ఫిబ్రవరి 9న నోటిఫికేషన్‌ జారీచేసింది. దానిని సవరిస్తూ మణికొండ జాగీర్‌ పరిధిలోని 1654.32 ఎకరాల భూమి తమ పరిధిలోనిదేనంటూ 2006, మార్చి 13వ తేదీన మరో సవరణ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ల్యాంకో హిల్స్‌ సహా పలు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు భూములు అప్పగించింది.

ఈ నేపథ్యంలో ఏపీ వక్ఫ్‌బోర్డు సవరించిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఆ భూములన్నింటినీ వక్ఫ్‌బోర్డుకు అప్పగించాలంటూ మాజీ ఎమ్మెల్సీ రహ్మాన్‌ తదితరులు హైకోర్టు, ఏపీ వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు ఈ కేసును విచారించి వక్ఫ్‌ బోర్డుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, ల్యాంకో హిల్స్‌, ఇతర సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల తరఫున సుప్రీంకోర్టులో 2012లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది.

17 ఏళ్ల నిష్క్రియాపరత్వమా?

వక్ఫ్‌బోర్డు సవరణ నోటిఫికేషన్‌ జారీచేయడంలో ముతావలీ నిబద్ధతపైనా సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. ‘‘1989లో నోటిఫికేషన్‌ జారీకాగా, అనంతరం 17 ఏళ్ల తర్వాత వక్ఫ్‌ బోర్డు సవరణ నోటిఫికేషన్‌ను జారీచేయడాన్ని పరిశీలించాల్సి ఉంది. సవరణ నోటిఫికేషన్‌ జారీచేసేందుకు అవసరమైన ప్రక్రియ ముతావలీ 2005, జనవరి 30న రాసిన లేఖతో ప్రారంభమైంది. 1989లో ప్రచురితమైన నోటిఫికేషన్‌లోనూ ఆయనను ముతావలీగానే ప్రస్తావించారు. తర్వాత 17 ఏళ్ల సుదీర్ఘ కాలం నిష్క్రియాపరత్వం ప్రదర్శించిన అనంతరం పెద్ద మొత్తంలో భూమిని వక్ఫ్‌ పరిధిలో చేర్చాలంటూ చొరవ చూపడం ఆయన నిబద్ధతను తెలియజేస్తోందని’’ ధర్మాసనం తీర్పులో అభిప్రాయపడింది.

ఏడాది నుంచి చురుగ్గా వాదనలు

2012లో సుప్రీంకోర్టులో ల్యాంకో హిల్స్‌ దాఖలుచేసిన ఈ కేసు తాలూకు పిటిషన్‌ జస్టిస్‌ కె.ఎస్‌.రాధాకృష్ణన్‌, జస్టిస్‌ దీపక్‌ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు తొలిసారిగా 2012, మే నెల 8న విచారణకు వచ్చింది. ల్యాంకో హిల్స్‌ పిటిషన్‌కు అనుబంధంగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు కలిపి విచారణ చేపట్టింది. గతేడాది ఆగస్టు నెల నుంచి విచారణ చురుగ్గా సాగింది. ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, టీఎస్‌ఐఐసీ తరఫున సీనియర్‌ న్యాయవాదులు వైద్యనాథన్‌, ఎం.వి.గిరి వాదనలు వినిపించగా, అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్సుగా పాల్వాయి వెంకటరెడ్డి వ్యవహారించారు.

సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం కేసీఆర్‌ సంతోషం

హైదరాబాద్‌ మణికొండ జాగీర్‌ భూములు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తంచేశారు. అందుకు కృషిచేసిన న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులకు అభినందనలు తెలిపారు. తీర్పుపై ఉన్నతాధికారులు, న్యాయవాదులతో సీఎం సమీక్షించారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ భూములను కాపాడేందుకు కృషిచేయాలని వారికి సూచించారు. హైదరాబాద్‌లోని కీలక ప్రాంతంలో ఉన్న ఈ భూముల్లో మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, ఎమ్మార్‌ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలతోపాటు ఐఎస్‌బీ, ఉర్దూ విశ్వవిద్యాలయం వంటివి ఉన్నాయి. స్థల ప్రాముఖ్యం దృష్ట్యా ఈ భూమిని కాపాడుకోవాలని తెరాస సర్కారు నిర్ణయించింది. తీర్పు ప్రతికూలంగా తీర్పువస్తే ఆయా సంస్థలకు భూములు మరోచోట ఇవ్వాల్సి వస్తుందని, అది సమస్యాత్మకమవుతుందని, పారిశ్రామిక వాతావరణానికి ప్రతికూలంగా మారడం సహా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించిన సీఎం ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సీనియర్‌ ఉన్నతాధికారులతోపాటు ఇద్దరు ప్రముఖ న్యాయవాదులకు బాధ్యతలను అప్పగించి, సమర్థంగా వాదనలు వినిపించాలన్నారు.

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

తెలంగాణ రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
ముఖ్యమంత్రి :  కె. చంద్రశేఖర్ రావు
గవర్నర్ :  తమిళిసై సౌందరరాజన్

 

1,654 ఎకరాలు ప్రభుత్వానివే మణికొండ జాగీర్‌ భూములపై సుప్రీం కోర్టు తీర్పు

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

1,654 ఎకరాలు ప్రభుత్వానివే మణికొండ జాగీర్‌ భూములపై సుప్రీం కోర్టు తీర్పు

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking

Sharing is caring!