Telugu govt jobs   »   Study Material   »   జోగినీ వ్యవస్థ మరియు దేవదాసి వ్యవస్థ

Jogini Vyavastha and Devadasi Vyavastha in Telangana For TSPSC Groups, Download PDF | తెలంగాణలో జోగినీ వ్యవస్థ మరియు దేవదాసి వ్యవస్థ

జోగినీ వ్యవస్థ శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్న సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో దీన్నే దేవదాసీ వ్యవస్థ అంటారు. సాంకేతికంగా తేడాలు ఉన్నప్పటికీ జోగినీ, దేవాదాసీ సంప్రదాయాలు దాదాపు ఒకే రకమైనవి. క్రీ.శ. 3వ శతాబ్దానికి చెందిన జోగి మరణశాసనం జోగిని వ్యవస్థ గురించి వివరిస్తుంది. ఛత్తీస్గఢ్ జోగిమర గుహల్లో దొరికిన శాసనం బ్రహ్మీలిపిలో ఉంది. క్రీ.శ. 7వ శతాబ్దం ప్రథమార్ధంలో భారత్లో పర్యటించిన చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ దేశమంతా దేవదాసీ వ్యవస్థ విస్తరించినట్లు పేర్కొన్నాడు.  కాళిదాసు మేఘదూత కావ్యంలో బాలికలను చిన్న వయసులోనే ఉజ్జయినిలోని మహంకాళీ దేవాలయాలకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు.

భారత దేశంలో జోగిని, దేవదాసి వ్యవస్థలు

తెలంగాణ లోనే కాకుండా భారతదేశ చరిత్రలో కూడా జోగిని, దేవదాసి వ్యవస్థల నేపథ్యం విభిన్న కోణాల్లో, దశల్లో కనపడుతుంది.జోగిని, దేవదాసి వ్యవస్థలు వైష్ణవ సంప్రదాయంలో కనపడతాయి. దేవదాసి అనే పదాన్ని ఆర్యులు వినియోగించిన వైదిక ధర్మాచరణ నుంచి తీసుకొన్నారు. దేవదాసి వ్యవస్థ భారతదేశమంతటా ఉందని హ్యుయాన్‌త్సాంగ్ పేర్కొన్నారు. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే స్త్రీలను దేవతలు, యోగిని, శక్తిమాత, డాకిణి, షాకిని, జోగినిగా పిలిచేవారని తెలుస్తున్నది. వాత్సాయనుడి కామసూత్రాల్లో వీరు వివిధ కళల్లో నైపుణ్యంగలవారని, గణిక, విలాసవతి పేర్లతో ఈ సంప్రదాయాన్ని కొనసాగించేవారని పేర్కొన్నారు. క్రీ.శ. 10వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్, తంజావూరు సంస్థానాల్లో 400 మందికిపైగా దేవదాసీలు ఉండేవారని, దేవాలయాల్లో పూజారుల తర్వాత స్థానం దేవదాసి లేదా జోగినులదే అని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది.

తెలంగాణ సామాజిక వ్యవస్థలో జోగిని, దేవదాసి సంప్రదాయాలు

తెలంగాణ సామాజిక వ్యవస్థలో అత్యంత అవమానకర సామాజిక దురాచారాలైన జోగిని, దేవదాసి వ్యవస్థలు నేటికీ కనపడుతూనే ఉన్నాయి. మతం ముసుగులో దళిత స్త్రీల లైంగిక బానిసత్వాన్ని, సామాజిక దోపిడీని ప్రతిబింబిస్తాయి. జోగిని, దేవదాసి వ్యవస్థలు మాత్రం నేటికీ తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొనసాగుతూనే ఉండటాన్ని బట్టి వీటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. జోగిని, దేవదాసీలను దేవర్ అడిగళర్ అని పిలిచేవారు. ఈ పేరుకు అర్థం దేవతలకు బానిస. అభం శుభం తెలియని ఆడపిల్లకు గ్రామదేవతతో పెళ్లి చేసి ఆమెను జోగిని అని పిలిచేవారు. 2002లో నిర్వహించిన సర్వే ఆధారంగా తెలంగాణ ప్రాంతంలో 42 వేల మంది, ఆంధ్రాలో 20 వేల మంది వరకు జోగినీలు, దేవదాసీలు ఉన్నట్లు అంచనా వేశారు. ఫ్రెంచ్ మత గురువు అబుదుబేయ్ (1792-1823) రచించిన హిందూ మానర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్ గ్రంథంలో శైవమతాన్ని ఆచరించిన కాకతీయ, రెడ్డి రాజులు, వెలమరాజుల కాలంలో జోగిని వ్యవస్థ ఉన్నట్లుగా పేర్కొన్నాడు.

వివిధ రాష్ట్రాలలో జోగినీ, దేవాదాసీలను ఏమని పిలిచేవారు?

జోగినీ ఆచారం కర్ణాటక ప్రాంతంలోని ‘బసవిరాండ్ర వ్యవస్థ’ నుంచి ఉమ్మడి ఆంధ్రాకు పాకింది. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు.

వివిధ రాష్ట్రాలలో జోగినీ, దేవాదాసీల పేర్లు
రాష్ట్రం ప్రాంతం పేరు
ఆంధ్రప్రదేశ్ అనంతపురం శివపార్వతి
చిత్తూరు శివపార్వతి, మాతమ్మ
ప్రకాశం మాతంగి
విజయనగరం తాయరమ్మ
కోస్తాతీర ప్రాంతాలు దేవదాసి
కర్నూలు బాల్వాయి
రాయలసీమ బసవీ
తెలంగాణ నిజామాబాద్ జోగిని
మెదక్
వరంగల్
రంగారెడ్డి అంబాబాయి
కరీంనగర్ శివసతులు, పార్వతి
మహబూబ్ నగర్ బసవి, జోగిని
అస్సాం నాటీస్, కుర్మపాస్, కడిపస్
కేరళ మహరీస్, తెవిడిచ్చిన్, నంగైనర్
మహారాష్ట్ర మురళీ, దేవాలి
కర్ణాటక బసవీ
తమిళనాడు దేవర్ అడిగకర్
ఒడిశా మహరి, మోహననారి.

జోగిని వ్యవస్థ 

జోగిని వ్యవస్థ భూస్వామ్య విధాన అవశేషంగా, మతం, ఆచారం పేరుతో నిమ్న వర్గాలకు చెందిన స్త్రీలను సామాజిక వ్యభిచారం పేరుతో దింపేవారు. ఇది తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశం అంతా కనపడే ఒక సాంఘిక సమస్య, ఇది ద్రావిడ సంస్కృతి లోని భాగం. జోగిని పదం ‘జోగి’ నుంచి వచ్చింది. దీనికి సంస్కృత పదమూలం యోగి. జోగినులు ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలకు చెందినవారే ఆడపిల్లలే ఉండేవారు. పేదరికం, నిరక్షరాస్యత, అమాయకత్వం వారిని భూస్వామికి దాసీలుగా చేసింది.   గ్రామంలో అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భవిష్యత్తులో ఏదో ప్రమాదం పొంచి ఉందని భావించి దీన్ని ఎదుర్కోడానికి గ్రామంలో తక్కువ వయసున్న (5-6 సం.లు) కల్గిన దళిత అమ్మాయిలను దేవుళ్లతో వివాహం జరిపేవారు. వీరినే జోగినులుగా పిలిచేవారు.

జోగిని వ్యవస్థపై తెలంగాణ ప్రాంతంలో చాలా పరిశోధనలు చేసిన వ్యక్తి హేమలత లవణం.  తెలంగాణ లో జోగిని వ్యవస్థ లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా మరియు తెలంగాణలో అధికంగా జోగినిల ను గుర్తించిన జిల్లా కరీంనగర్.  వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం లో జోగినిలను ప్రత్యేకంగా ‘శివసత్తులు’ అంటారు.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

జోగుపట్టం

గ్రామానికి అరిష్టం వచ్చినప్పుడు గ్రామదేవతకు మొక్కుబడి చెల్లించడానికి వివాహం కానీ ఆడపిల్లను గ్రామానికి దత్తత ఇవ్వడం అనే సంప్రదాయం నుంచి జోగిని వ్యవస్థ ప్రారంభమైంది. సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన స్త్రీలను జోగినులుగా మారుస్తారు. అమ్మాయిని జోగినిగా మార్చే కార్యక్రమాన్ని జోగుపట్టం అంటారు.

జోగుపట్టంలో అమ్మాయిని పసుపు నీళ్లలో ముంచి, పసుపు చీర కట్టి, తలనిండా పూలు, ఎర్రటి బొట్టుపెట్టి నూతన వధువుగా అలంకరిస్తారు.

అమ్మాయిని ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయానికి తీసుకెళ్తారు. బ్రాహ్మణేతర పూజారైన పోతరాజు  మంగళ సూత్రధారణే కాకుండా గావుపట్టు అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాడు.

జోగిని వ్యవస్థపై  రచనలు

రచయిత రచనలు
వకుళాభరణం లలిత జోగిని వ్యవస్థ, మతం ముసుగులో వ్యభిచారం
శాంతి ప్రబోధ జోగిని
హేమలతా లవణం మృత్యోర్మ అమృతం గాయం
లక్ష్మీకాంత మోహన్ ఎల్లమ్మ కథ
వి.ఆర్.రాసాని మట్టి మనుషులు
బోయ జంగయ్య జగడం

జోగిని వ్యవస్థ నిర్మూలన దిశగా చర్యలు

జోగిని వ్యవస్థ నిర్మూలన దిశగా అనేక చట్టాలను ప్రభుత్వాలు తీసుకువచ్చాయి.

  • 1882లో దేశంలో మొదటిసారిగా బాలికలను దేవునికి సమర్పించే విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది.
  • 1922లో హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత ఆది హిందూ సాంఘిక సదస్సులో జగన్‌మిత్ర మండలి (భాగ్యరెడ్డి వర్మ) దళిత బాలికలను దేవతలకు సమర్పించే జోగిని వ్యవస్థ నిషేధానికి తీర్మానం చేసింది.
  • 1929లో బ్రిటిష్ ప్రభుత్వం నాయిక బాలికల రక్షణ చట్టాన్ని రూపొందించింది.
  • 1946లో నాటి ట్రైనీ కలెక్టర్ ఆనంద్‌కుమార్ తెలంగాణలో జోగినులపై పరిశోధన చేసి ప్రభుత్వం దృష్టికి తెచ్చాడు.
  • 1974లో స్థాపించిన సంస్కార్ అనే స్వచ్ఛంద సంస్థను జోగిని వ్యవస్థపై పోరాడాలని నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్‌బెన్ జోషి కోరారు. ఈ సంస్థ అధ్యక్షులు లవణం, కార్యదర్శి హేమలతా లవణం. కేంద్రం : విజయవాడ.
  • 1984లో నిజమాబాద్ జిల్లా కలెక్టర్ ఆశామూర్తి జిల్లాలో జోగిని వ్యవస్థను రూపుమాపడానికి, జోగినులను సంస్కరించడానికి వారి పునరావాసం కోసం బినోల ఆశాపురం కాలనీ, ఎడవల్లి వద్ద ఆశానగర్‌లను ఏర్పాటుచేశారు.
  • కుముద్‌బెన్ జోషి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (NISA) పేరుతో జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 1987లో NISA ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జోగిని సంక్షేమంపై జాతీయ సదస్సు జరిగింది.
  • 1987లో నిజామాబాద్ జిల్లా వర్ని గ్రామంలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు నాస్తిక మిత్రమండలి సభ్యుడైన మాలిని రామకృష్ణారావు సహకారంతో చెల్లి నిలయం స్థాపించారు.
  • చెల్లి నిలయంలో AT HOME WITH FAMILY అనే కార్యక్రమం ద్వారా జోగినులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసేవారు. ఆర్.కె.మూర్తి చెల్లి నిలయానికి భూమిని విరాళంగా ఇచ్చాడు.
  • చెల్లి నిలయం జోగినులకు చేతివృత్తులు, వ్యవసాయ పనుల్లో శిక్షణ అందించడంతో పాటు స్టేట్ ఎట్ హోమ్ పేరుతో అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించి వారిలోని నైపుణ్యాలను, ప్రతిభను వెలికి తీయడానికి ప్రయత్నించింది.
  • 1988లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హేమలతా లవణం కృషి ఫలితంగా జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని ప్రవేశపెట్టింది.
  • గ్రేస్ నిర్మల అధ్యక్షతన మహబూబ్‌నగర్‌లో ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక సంఘటన్ ఏర్పాటు చేసారు. ఈ సంస్థ జోగిని సమర్పణను, సిడిని వ్యతిరేకించింది.
  • రంగారెడ్డి జిల్లా దోమ జాతరలో సిడిని మాన్పించినందుకుగాను ఈ సంస్థకు స్వశక్తి పురస్కారం లభించింది. ఈ సంస్థ జోగినులకు వివాహాలు జరిపించింది. జోగినుల హక్కుల కోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది.

దేవదాసి వ్యవస్థ

దేవ అనగా దేవుడు, దాసి అనగా సేవలు చేసేవారు. దేవదాసి అంటే గుడిలోని దేవుని ఉత్సవాల్లో నాట్యసేవ చేస్తూ జీవితాంతం అవివాహితగా ఉంటూ వేశ్యావృత్తిలో జీవించే స్త్రీ. వీరిని ‘భోగంవారు’ అంటారు. దేవదాసి వ్యవస్థ అనేది ఆర్య సంస్కృతి. దీనిలో కూడా కన్యలను దేవుడితో వివాహం జరుపుతారు. దేవదాసి వ్యవస్థ దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళలో తప్ప అన్ని రాష్ర్టాల్లో విభిన్న రూపాల్లో కొనసాగుతున్నది. దేవదాసి వ్యవస్థ వ్యవస్థపై అత్యధికంగా పోరాటం చేసినది ముద్దు లక్ష్మిరెడ్డి.  దేవదాసిలకు కఠినమైన జీవనం విధానం ఉండేది. దేవదాసికి ఉండాల్సిన లక్షణాలను పూజారులు నిర్ణయించేవారు. దేవదాసిగా మారిన ఆడపిల్ల తర్వాత వివాహం చేసుకోరాదు. మంగళ, శుక్ర వారాల్లో ఉపవాసం చేస్తు, 5 ఇళ్లల్లో యాచించాలి. ఇలా మరన్నో కఠినమైన జీవన విధానాలు ఉండేవి.

దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టాలు

దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి బ్రిటిష్ వలస కాలం నుంచి అనేక చట్టాలు రూపొందాయి.

దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టాలు
ముఖ్యమైన చట్టాలు/ప్రభుత్వ చర్యలు సంవత్సరం
బొంబాయి దేవదాసి చట్టం 1934
మద్రాస్ దేవదాసి చట్టం 1940
మైసూర్ దేవదాసి చట్టం 1940
దేవదాసి నిషేధ చట్టం 1947

దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు:

  • ముత్తు లక్ష్మీరెడ్డి దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా దశాబ్దాల పోరాటం ఫలితంగా 1947లో నాటి మద్రాస్ రాష్ట్రంలో దేవదాసి నిషేధ చట్టం రూపొందించింది. సుబ్బరామన్ కృష్ణయ్య యామిని పూర్ణతిలకం, నాగరత్నమ్మ వంటి సంఘసంస్కర్తల ముత్తు లక్ష్మీరెడ్డి  కి సహకారం అందించారు.
  • 1988లో ఈ దేవదాసి నిషేధ చట్టాన్ని నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వర్తించే విధంగా సవరణలు చేశారు.
    • ఈ చట్టం ప్రకారం దేవదాసి వ్యవస్థ పూర్తిగా నిషేధం. ఎవరైన ఈ వ్యవస్థను ప్రొత్సహిస్తే వారికి 3 ఏండ్ల జైలు, రూ. 3 వేల జరిమానా విధిస్తారు.
  • ఏక సభ్య కమిషన్: నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోగిని, దేవదాసి, మాతంగి, బసివిని దురాచారాలు ఈ వ్యవస్థల ప్రస్తుత పరిస్థితి కారణాలు మరియు పరిష్కారాల కోసం జస్టిస్ రఘునాథరావు కమిషన్‌ను ఏర్పాటుచేసింది. నారాయణస్వామి అనే సంఘ సంస్కర్త సామాజిక దురాచారాల నిర్మూలన విషయంలో ప్రభుత్వం పాత్రకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినందున ఈ కమిషన్‌ను ఏర్పాటుచేశారు.
  • హిందూ వారసత్వ చట్టం 1956 జోగిని, దేవదాసిలకు తండ్రి ఆస్తిపై సమాన హక్కు కల్పించింది.

తెలంగాణలో జోగినీ వ్యవస్థ మరియు దేవదాసి వ్యవస్థ పై తీసిన చలనచిత్రాలు

  • 1978లో ‘ప్రత్యూష’ సినిమా జట్ల వెంకటస్వామినాయుడు దర్శకత్వంలో రూపొందింది.
  • 1984లో దేవాదాసీ జోగినిలపై తీసిన చలనచిత్రం ‘గిథ్’. దర్శకుడు టి.ఎస్.రంగా.
  • 1981లో మోహన్ కావ్య నిర్దేశకత్వంలో ‘మహానంది’ అనే చిత్రం తీశారు.

Download Jogini Vyavastha and Devadasi Vyavastha in Telangana PDF

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs | AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

జోగిని వ్యవస్థపై తెలంగాణ ప్రాంతంలో పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు?

జోగిని వ్యవస్థపై తెలంగాణ ప్రాంతంలో చాలా పరిశోధనలు చేసిన వ్యక్తి హేమలత లవణం. 

తెలంగాణ లో జోగిని వ్యవస్థ లేని జిల్లా ఏది?

తెలంగాణ లో జోగిని వ్యవస్థ లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా.

తెలంగాణలో అధికంగా జోగినిల ను గుర్తించిన జిల్లా ఏది?

తెలంగాణలో అధికంగా జోగినిల ను గుర్తించిన జిల్లా కరీంనగర్.