Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Foundation stone laid for Google's second...

హైదరాబాద్ లో గూగుల్‌ తమ రెండో అతి పెద్ద కార్యాలయానికి శంకుస్థాపన

హైదరాబాద్‌: దిగ్గజ సాంకేతిక సంస్థ గూగుల్‌ తమ రెండో అతి పెద్ద కార్యాలయ ప్రాంగణాన్ని హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్మించనుంది. 7.3 ఎకరాల్లో 30.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే  కార్యాలయ ప్రాంగణ సముదాయం నిర్మాణానికి గురువారం పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. నిర్మాణాన్ని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామని ఈ కార్యక్రమంలో గూగుల్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా భవనం నమూనాను విడుదలచేశారు. అమెరికాలోని మౌంటెన్‌ వ్యూ తర్వాత గూగుల్‌ అతిపెద్ద కార్యాలయం ఇదేనని వెల్లడించారు. ఈ సందర్భంగా యువత, మహిళలు, విద్యార్థులకు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ సహా పలు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు, వారిని ఉద్యోగాలకు సిద్ధంచేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్‌ భారత విభాగ ఉపాధ్యక్షుడు సంజయ్‌ గుప్తా, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, గూగుల్‌ సంస్థ ప్రపంచంలో రెండో అతిపెద్ద కార్యాలయం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం అభినందనీయమన్నారు. ఇది తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ డిజిటల్‌ సాధికారత సాధించేలా శిక్షణ ఇవ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమని కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. సీఎం కేసీఆర్‌ ‘డిజిటల్‌ తెలంగాణ’ దార్శనికతకు వాస్తవరూపం తెచ్చేందుకు ఇది సహకరిస్తుందన్నారు. ‘‘తెలంగాణ ప్రభుత్వ సుస్థిరత కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఆర్థిక, సమ్మిళిత సామాజిక అభివృద్ధి, యువత, మహిళలు, విద్యార్థులకు డిజిటల్‌ సాంకేతికతపై శిక్షణ, మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటల్‌, వాణిజ్య, ఆర్థిక, పారిశ్రామిక నైపుణ్యాలపై తర్ఫీదు, డిజిటల్‌ బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాల ఆధునికీకరణ, వ్యవసాయంలో డిజిటల్‌ సాంకేతికత వినియోగం వంటి అంశాల్లో ఇది దోహదం చేస్తుంది. తెలంగాణలో భారీ పెట్టుబడులకూ ఉపకరిస్తుంది. పౌర సేవల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఉపయుక్తంగా ఉంటుంది’ అని కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే గూగుల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్య అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇకపై కొలాబరేటివ్‌ టూల్స్‌ ద్వారా విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందిస్తుందని వెల్లడించారు. ప్రజా రవాణా మెరుగయ్యేందుకు గూగుల్‌ మ్యాప్‌ సేవలను మరింత విస్తరించబోతున్నట్టు తెలిపారు. ఒప్పందంలో భాగంగా సంస్థ..వీహబ్‌తో కలిసి ఉమెన్‌ పేరుతో మహిళలకు నానో, మైక్రో వ్యాపార రంగాల్లో రాణించేందుకు కావాల్సిన సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని అందిస్తుందన్నారు.

 

*******************************************************************************************హైదరాబాద్ లో గూగుల్‌ తమ రెండో అతి పెద్ద కార్యాలయానికి శంకుస్థాపన

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

హైదరాబాద్ లో గూగుల్‌ తమ రెండో అతి పెద్ద కార్యాలయానికి శంకుస్థాపన

Download Adda247 App

Sharing is caring!