Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Contaminating Godavari

కలుషితమౌతున్న గోదావరి ,Contaminating Godavari

హైదరాబాద్‌: గోదావరి..ఈ పేరు వినగానే గలగల పారుతున్న నదీమతల్లి మన కళ్లెదుట సాక్షాత్కరిస్తుంది. నాడు స్వచ్ఛమైన జలనిధి ఈ నది సొంతం. కానీ నేడు మురుగునీరు, పారిశ్రామికవ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి. ఫలితంగా జలంలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతోంది. గోదావరి, ఉప నదుల నీటి నాణ్యత ‘డి’ గ్రేడ్‌కి పడిపోయినట్లు కేంద్ర జలసంఘం గుర్తించింది. కొన్నిచోట్ల ఆక్రమణలతో నది కుచించుకుపోయింది. కేంద్రం రూపొందించిన డీపీఆర్‌లో ఇవి వెల్లడయ్యాయి. గోదావరి పునరుజ్జీవం కోసం రూ.1,700.84 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

శుద్ధి చేయకపోవడమే సమస్య

గోదావరి తీరంలో నాసిక్‌, ఔరంగాబాద్‌, నాందేడ్‌ (మహారాష్ట్ర), భద్రాచలం, నిజామాబాద్‌, మంచిర్యాల, రామగుండం (తెలంగాణ), రాజమహేంద్రవరం, నరసాపురం(ఆంధ్రప్రదేశ్‌) గోదావరి ఒడ్డునే ఉన్నాయి. నాసిక్‌, ఔరంగాబాద్‌లలో ఆటోమొబైల్‌ పరిశ్రమల రసాయన వ్యర్థాలు, ప్లాస్టిక్‌ ఘనవ్యర్థాలు వచ్చి నదిలో కలుస్తున్నాయి. మొత్తంగా 125 పెద్ద, 350 మధ్యతరహా, 2,500 చిన్న పరిశ్రమలున్నాయి. వ్యవసాయ భూముల్లో ఎరువులు, పురుగుమందుల వాడకం అధికంగా ఉండటమూ కాలుష్యాన్ని పెంచుతోంది. నదీతీరంలో పలుచోట్ల అక్రమంగా ఇసుకను తవ్వుతున్నట్లు డీపీఆర్‌లో పేర్కొన్నారు.

నీటి నాణ్యత గ్రేడింగ్‌…

నీటిలో బీఓడీ (బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌), డీఓ (నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌) ఆధారంగా లెక్కిస్తారు. వీటితో పాటు కొలిఫాం బ్యాక్టీరియా, అమ్మోనియో, పీహెచ్‌ని పరిగణనలోకి తీసుకుంటారు. డీఓ పరిమాణం లీటరుకు కనీసం 4 మిల్లీగ్రాములు ఉండాలి. బీఓడీ 3 ఎంజీ దాటొద్దు. ఇది పలుచోట్ల 4-9 వరకు ఉంది.

  • ఎ గ్రేడ్‌: ఉత్తమం. మంచినీళ్లు. బ్యాక్టీరియా తొలగించి తాగాలి
  • బి గ్రేడ్‌: ఈ నీటిలో నేరుగా స్నానం చేయొచ్చు. కొలిఫాం బ్యాక్టీరియా కొంచెం అధికంగా ఉంటుంది. బ్లీచింగ్‌ చేసి తాగాలి
  • సి గ్రేడ్‌: నీటిని శుద్ధి చేసి బ్యాక్టీరియాను తొలగించాకే తాగాలి
  • డి గ్రేడ్‌: చేపలు, జంతువులకే పనికి వస్తాయి
  • ఇ గ్రేడ్‌: సాగునీటి అవసరాలకే… ఈ దశ దాటితే నీళ్లు పనికిరావు

పునరుజ్జీవ చర్యలు

  • నదీతీరంలో క్షీణించిన అడవుల్ని పునరుద్ధరించాలి. రూ.330.27 కోట్లతో నేల, తేమ సంరక్షణ పనులు
  • వెదురు, గడ్డితో తీర ప్రాంత స్థిరీకరణ. ఆక్రమణల తొలగింపు
  • మట్టి కోతను నియంత్రించడం, భూగర్భ జలాల పరిరక్షణ. అక్రమ మైనింగ్‌ నిషేధం
  • గోదావరి, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో వ్యవసాయ, అటవీ తోటలు, అర్బన్‌ లాండ్‌ స్కేప్‌ అభివృద్ధి. టేకు, ఇతర మొక్కల పెంపకం. ఎకో పార్కుల అభివృద్ధి
  •  పారిశ్రామిక, గృహసంబంధ వ్యర్థాల నియంత్రణ, శుద్ధి చేపట్టాలి. తీర గ్రామాలు, పట్టణాల్లో మురుగుశుద్ధి కేంద్రాలను స్థాపించాలి.

******************************************************************************

Contaminating Godavari

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Contaminating Godavari

 

Sharing is caring!