హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ పరిశోధన సంస్థ ‘కెమ్‌వేద లైఫ్ సైన్సెస్’ రూ.150 కోట్లతో హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. 500 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయంది. తెలంగాణకు పెట్టుబడుల సాధన కోసం అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌తో శాన్ డియాగోలో కెమ్‌వేద లైఫ్ సైన్సెస్ సంస్థ ఛైర్మన్, సీఈవో బీమారావు పారసెల్లి తమ ప్రతినిధి బృందంతో సోమవారం సమావేశమై ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఔషధ, బయోటెక్, వ్యవసాయ రసాయన రంగాల్లో పరిశోధనలకు పేరొందిన తమ సంస్థ అమెరికాలో 8 ఎకరాల్లో రెండుచోట్ల తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ 450 మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణను ఎంచుకున్నామని, అక్కడి ప్రభుత్వ విధానాలకు తోడు స్నేహపూర్వక ధోరణి, కేటీఆర్ చొరవతో తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శించి తమ కేంద్రం స్థాపనకు సన్నాహాలు చేస్తామన్నారు. దీనిపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తన పర్యటనలో తొలిరోజే కెమ్‌వేద నుంచి భారీ పెట్టుబడి రావడం ఆనందాన్ని కలిగించిందన్నారు. కెమ్‌వేదకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్‌లు పాల్గొన్నారు.
ఔషధనగరిలో స్క్రిప్స్ సంస్థ
మరో విఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ ఔషధనగరిలో ఏర్పాటు చేయనున్న విశ్వవిద్యాలయంలో భాగస్వాములవ్వాలని కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఔషధనగరి విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశాల రూపకల్పన, బోధన సిబ్బంది నియామకం, విద్యార్థుల మార్పిడి, సంయుక్త పరిశోధన, ఉమ్మడి డిగ్రీ కార్యక్రమాల రూపకల్పనకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఔషధనగరి దృశ్యరూపక ప్రదర్శన ఇచ్చారు. సమావేశంలో స్క్రిప్స్ ప్రతినిధులు జేమ్స్ విలియమ్సన్, మేరీ వాంగ్, అర్నబ్ ఛటర్జీ, సుమిత్ చందా పాల్గొన్నారు. ప్రపంచ ఔషధరంగానికి ఇది జీవనాడిగా నిలుస్తుందని తెలిపారు. వారు మాట్లాడుతూ, తెలంగాణ పారిశ్రామిక రంగంలో విశ్వఖ్యాతి పొందుతోందన్నారు. తమ సంస్థ వివిధ దేశాల్లో 50 పరిశోధన సంస్థలు, 200 ప్రయోగశాలలు, 2400మంది శాస్త్రవేత్తలతో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందన్నారు. త్వరలోనే తమ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకుముందు శాన్‌డియాగోకు చేరుకున్న కేటీఆర్‌కు తెలుగు రాష్ట్రాల ప్రవాసులు భారీఎత్తున స్వాగతం పలికారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |