Telugu govt jobs   »   Telugu Current Affairs   »   AP Minister Mekapati Gautam Reddy's sudden...

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో  హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్‌ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలడంతో ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అనంతరం గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు 9.16గంటలకు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు.

గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం నిన్ననే హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీకి ఆది నుంచి బలమైన మద్దతుదారుగా ఉన్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడు గౌతమ్‌ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున ఆయన విజయం సాధించారు.

గౌతమ్‌రెడ్డి తొలిసారిగా 2014లో ఆనం రామనారాయణ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నాయకుడిగా గౌతమ్‌ రికార్డు సృష్టించారు. 2019లో రెండో పర్యాయం ఆయన బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించి కేబినెట్‌ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గత నెల 22వ తేదీన మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో స్వల్పలక్షణాలు ఉండటంతో చికిత్స పొంది కోలుకొన్నారు.

తండ్రి నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకొని.. 

మేకపాటి గౌతమ్‌ రెడ్డి తన తండ్రి రాజమోహన్‌ రెడ్డి అడుగు జాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి వీరి స్వగ్రామం. 1985లో రాజమోహన్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా.. 1989, 2004, 2009, 2012, 2014లో ఒంగోలు, నర్సరావుపేట, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పార్లమెంట్‌సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజమోహన్‌ రెడ్డికి ముగ్గురు కుమారులు. వీరిలో గౌతమ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గౌతమ్‌ రెడ్డి బాబాయ్‌ మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గతంలో 2004, 2009, 2012ల్లో కూడా ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

తొలిసారి మంత్రి అయిన స్థానికుడు ఆయనే..

ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న స్థానిక వ్యక్తి గౌతమ్‌. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 1955 ఎన్నికల్లో బెజవాడ గోపాల్‌ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత 1956లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఆర్థిక మంత్రిగా చేశారు. గోపాల్‌ రెడ్డి స్థానికులు కారు.. ఆయనది బుచ్చిరెడ్డిపాళెం.  ఆయన తర్వాత 1983 వరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి రాలేదు. 1984లో ఇక్కడి నుంచి గెలిచిన ఆనం వెంకట రెడ్డి.. నాదెండ్ల  భాస్కరరావు మంత్రివర్గంలో నెలరోజులు పనిచేశారు. ఈయన తర్వాత తనయుడు రాంనారాయణ రెడ్డి 2009లో ఇక్కడి నుంచి విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక మంత్రిగా చేశారు. వీరిది నెల్లూరు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన గౌతమ్‌ రెడ్డి గ్రామం బ్రాహ్మణపల్లి ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఉంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆత్మకూరు నియోజకవర్గ వ్యక్తిగా గౌతమ్‌ నిలిచారు.

మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రొఫైల్‌

 

* తల్లిదండ్రులు: మేకపాటి రాజమోహన్‌ రెడ్డి-మణిమంజరి

* పుట్టిన తేదీ: 2-11-1971

* విద్య: హైదరాబాద్‌ భద్రుకా కాలేజ్‌లో గ్రాడ్యూషన్‌, యూకేలో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

* వ్యాపారం: 1997లో కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌లో వ్యాపార జీవితం మొదలుపెట్టారు.

* రాజకీయ రంగ ప్రవేశం: 2014లో ఆత్మకూర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

* భార్య : మేకపాటి శ్రీకీర్తి

* పిల్లలు: ఒక కుమార్తె, ఒక కుమారుడు

* బాబాయ్‌: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్యే)

 

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్

 

ap-minister-mekapati-gautam-reddys-sudden-death

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

ap-minister-mekapati-gautam-reddys-sudden-death

 

 

Sharing is caring!