Telugu govt jobs   »   Telugu Current Affairs   »   ap cm jagan launched nabard state...

AP: ‘అగ్రి’లో నంబర్‌ వన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే మన ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలోనే వ్యవసాయ రంగానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఆర్బీకేలతో పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలు)ల అనుసంధానం, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల నియామకంతో సహకార బ్యాంకింగ్‌ కార్యకలాపాలు పెరిగేలా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

తద్వారా రైతులకు రుణ సదుపాయం మరింత అందుబాటులోకి వస్తుందన్నారు. వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు ద్వారా గ్రామాలకు రక్షిత మంచి నీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమాలన్నింటికీ నాబార్డు, బ్యాంకులు తగిన సహాయ, సహకారాలు అందించాలని కోరారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో వివిధ రంగాల్లో రుణ ఆవశ్యకత అంచనాలతో నాబార్డు రూపొందించిన స్టేట్‌ ఫోకస్‌ పత్రాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సెమినార్‌లో సీఎం ఇంకా ఏమన్నారంటే..

సుస్థిర ఆర్థిక ప్రగతికి రుణాలు దోహదం
► 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైంది. 2022 ఫిబ్రవరి 11 నాటికి దేశ వ్యాప్తంగా బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.115 లక్షల కోట్లు. ఈ విషయంలో ఏటా 7.86 శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తోంది. జీడీపీ పెరుగుదలతో సమాన స్థాయిలో ఇస్తున్న రుణాలు కూడా ఉండాలి. సుస్థిర ఆర్థిక ప్రగతికి ఇది చాలా అవసరం. ఈ విషయంలో కొత్త వ్యూహాల దిశగా అడుగులు వేయాలి.
► కోవిడ్‌–19 విసిరిన సవాళ్ల నేపథ్యంలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయం, దాని అనుంధ రంగాలు 4.16 శాతం ప్రగతిని సాధించాయి. కోవిడ్‌ సమయంలో రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు మంచి సహకారం అందించినందుకు ధన్యవాదాలు. తద్వారా రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నాం.

సాగు రంగంలో ఆర్బీకేలు కీలక పాత్ర
► ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం కోసం రైతు భరోసా, రుణాలు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని పంట రుణాలు, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తోంది.
► ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ఇ–క్రాప్‌ చేస్తున్నాం. ఇదో విప్లవాత్మక చర్య. గతంలో కొంత మంది మాత్రమే చేసుకునే వారు. చేసుకోలేని వారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున నష్టపోయేవారు. ఇలా జరగకూడదని రైతుల తరఫున ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది.
► సబ్సిడీ మీద వ్యవసాయ ఉప కరణాలను రైతులకు వ్యక్తిగతంగా సరఫరా చేయడంతో పాటు సీహెచ్‌సీల(కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌) ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 10,700 ఆర్బీకేలు సాగు రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
► ఆర్బీకేలు రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ చేదోడుగా నిలుస్తున్నాయి. రూరల్‌ నియోజకవర్గాల స్థాయిలో (147 నియోజకవర్గాలు) అగ్రి ల్యాబ్స్‌ ఏర్పాటు చేశాం. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.

బ్యాంకులతో కలిసి కార్యాచరణ
► సహకార బ్యాంకులు, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం. పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం. ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు.. బ్యాంకులు, సొసైటీలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించాను.
► ఫుడ్‌ ప్రాసెసింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టి పెట్టాం. ఆర్బీకే, ఇ –క్రాపింగ్, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌తో పాటు 542 సేవలను అందిస్తున్న గ్రామ సచివాలయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని ఒకే తాటిపైకి తీసుకువస్తున్నాం.
► బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు కీలకంగా వ్యవహరిస్తారు. రుణ సదుపాయం కల్పనలో ఆర్బీకేలు సంధానకర్తలుగా ఉండాలి. అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణం అందాలి. ఈ మేరకు అమలు చేసేందుకు బ్యాంకులతో సమావేశమై తగిన కార్యాచరణ ప్రణాళిక, ఎస్‌ఓపీ తయారు చేయాలి.
► ఇప్పుడు మనం నానోఫెర్టిలైజర్స్‌ వంటి టెర్మినాలజీ ఉపయోగిస్తున్న ఆధునిక యుగంలో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు రావాలని, వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామ స్థాయిలోనే అభివృద్ధి చేయాలనే నాబార్డ్‌ చైర్మన్‌ సూచనను పరిగణనలోకి తీసుకుంటాం. దాన్ని అందుకునే దిశగా వ్యవసాయ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై కూడా దృష్టి పెడతాం.

ఫ్లోరోసిస్‌ సమస్యను అధిగమించాలి
► ఫ్లోరోసిస్‌ సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని చోట్ల నీటి కొరత అధికంగా ఉండడం వల్ల రవాణాకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్ధితి. వీరికి రక్షిత తాగు నీటిని అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఇలా ఎంపిక చేసిన చోట్ల బ్యాంకులు మరింత ముందుకొచ్చి సాయం చేయాల్సి ఉంది.
► మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్‌ లాంటి రాష్ట్రాలకు వలస వెళ్లకుండా రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల పనులు ప్రారంభించాం.
► కరువు నివారణ కోసం రాయలసీమ, ఉత్తరాంధ్రాలో ఎంపిక చేసిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. తద్వారా గ్రామాల్లో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేలా ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం.

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

AP GST collection was Rs 3,157 crore

Sharing is caring!