AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the Current affairs of December 3rd and 4thWeek.
AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల ముందు అప్పటికప్పుడు ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం. GA మీరు 10-15 రోజుల్లో పూర్తి చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.
దీని ద్వారా నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.
APPSC/TSPSC Sure shot Selection Group
Andhra Pradesh State Weekly Current Affairs
1. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు 5 స్కోచ్ అవార్డులు లభించాయి

ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్), డీఆర్‌డీఏ విభాగాలకు 5 స్కోచ్ అవార్డులు వచ్చాయి. దిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ వీటిని అందుకున్నారు. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు మంజూరుకు, స్త్రీనిధి సంస్థకు రెండు గోల్డెన్ అవార్డులు అందుకున్నారు.
2. జలమట్టాలు పడిపోయిన జిల్లాల్లో కర్నూలుకు మొదటి స్థానం

2011 నవంబరు నుంచి 2022 నవంబరు వరకు పలు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పడిపోయిన భూగర్భ జల మట్టాలను ఉమ్మడి జిల్లాలను పరిశీలిస్తే ఆంధ్ర ప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో పదేళ్ల కాలంలో 31.74 మీటర్ల లోతుకు మట్టం పడిపోయింది. కృష్ణా జిల్లాలో 15 మీటర్ల లోతుకు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 17.54 మీటర్లకు, మెదక్‌లో 17.07 లోతుకు జల మట్టం పడిపోయింది.
3. సామాజిక పురోగతి ర్యాంకుల్లో ఏపీకి 23వ స్థానం, తెలంగాణకు 26వ స్థానం లో నిలిచాయి

- ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన సామాజిక పురోగతి సూచికల్లో తెలుగు రాష్ట్రాలు దిగువ మధ్య స్థాయిలో నిలిచాయి. పుదుచ్చేరి మొదటి స్తానం లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 23, తెలంగాణ 26వ స్థానాలకు పరిమితమయ్యాయి. ‘సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ – స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఇంపరేటివ్ నివేదికను రుపొందిస్తుంది.
- విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, గూడు, వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ, ఛాయిస్, పర్యావరణ నాణ్యత ఆధారంగా రాష్ట్రాల సామాజిక పురోగతిని అంచనా వేశారు. మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో సామాజిక పరిస్థితుల కొలమానంగా నివేదిక రూపొందించారు. ఈ ర్యాంకుల్లో పుదుచ్చేరి 65.99 మార్కులతో తొలి ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్ 53.60 మార్కులతో 23, తెలంగాణ 52.11 మార్కులతో 26వ ర్యాంకులలో నిలిచాయి.
- మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, హెచ్‌ఐవీ వ్యాప్తి నిరోధంవంటి విభాగాల్లో రాజస్థాన్ 73.74 మార్కులతో దేశంలో తొలి స్థానాన్ని సాధించగా, ఏపీ 39.17 మార్కులతో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. అత్యధిక మధుమేహం ఉన్న జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి, తెలంగాణలో హైదరాబాద్ నిలిచాయి.
- కళాశాలలు, జనాభా నిష్పత్తిలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు తొలి మూడు స్థానాలను చేజిక్కించుకున్నాయి. కర్ణాటకలో ప్రతి లక్ష జనాభాకు 59 కళాశాలలు అందుబాటులో ఉండగా తెలంగాణలో 53, ఆంధ్రప్రదేశ్‌లో 51 ఉన్నాయి.
4. దేశంలోనే తలసరి రుణ భారంలో ఆంధ్ర ప్రదేశ్ తొలి స్థానం లో నిలిచింది

తలసరి రుణ భారంలో ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలో తొలి స్థానంలో నిలిచారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రతి రైతు కుటుంబం మీద రూ.74,121 కోట్ల రుణం ఉండగా, ఏపీ రైతులపై అంతకు మూడు రెట్ల భారముంది. తెలంగాణలో ప్రతి రైతు కుటుంబంపై రూ.1,52,113 రుణ భారముంది. అత్యధిక అప్పున్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది.
5. అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి

దేశంలో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. 25 హైకోర్టుల్లో కలిపి 28,469 ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండగా, ఒక్క ఏపీలోనే 11,348 (39.86) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పట్నా (6,554), తెలంగాణ (6,236)లలో ఉన్నాయి.
6. ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు, వేదింపులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. 2018తో పోలిస్తే 2021 నాటికి అత్యాచారాలు 22%, దాడులు 15%, ఆత్మగౌరవానికి భంగం కల్గించిన కేసులు 31% మేర పెరిగాయి.ఏపీలో 2018 నుంచి 2021 మధ్యకాలంలో మహిళలపై 4,340 అత్యాచారాలు, 8,406 ఆత్మగౌరవానికి భంగం కల్గించే ఉదంతాలు, 18,883 సాధారణ దాడులు చోటు చేసుకున్నాయి. ఆత్మగౌరవానికి భంగం కల్గించడంలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.
7. ఏపీకి 3 ఎనర్టియా అవార్డులు లభించాయి

ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ సంస్థలకు మూడు ఎనర్టియా అవార్డులు పొందిందని ఇంధన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దిల్లీలో నిర్వహించిన 15వ ఎనర్టియా అవార్డుల సదస్సు లో రాష్ట్రం తరఫున ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ట్రాన్స్‌కో వీసీఎండీ బి.శ్రీధర్ అవార్డులను అందుకున్నారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, విద్యుత్ పంపిణీ రంగంలో అత్యుత్తమంగా నిలిచిన ఏపీ ట్రాన్స్‌కో అవార్డులు దక్కించుకుంది.
8. 8వ శతాబ్దం నాటి తెలుగు శాసనం ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట వేములమ్మ దేవాలయంలో 8వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం వెలుగులోకి వచ్చింది. దేవాలయం రాతిపై ఉన్న శాసనాన్ని, గ్రామానికి చెందిన జి.వి.నారాయణరెడ్డి అక్కడి విగ్రహాలను అచ్చులు తీసి పురావస్తు శాఖకు పంపారు. వీటిని పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నంరెడ్డి ఇవి పురాతనమైన తెలుగు శాసనాలని తెలియజేశారు. ఈ శాసనంలో రేచన అనే వ్యక్తి, గుండి అనే నది పేరు ప్రస్తావన ఉందని చెప్పారు. ఇక్కడి సమీపంలో గుండ్లకమ్మ నది ఉందని, పూర్వం గుండి నదిగా దీన్ని పిలిచే వారని తెలిపారు.
9. రోడ్డు ప్రమాదాల్లో 7, 8 స్థానాల్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి

దేశంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచాయి. కేంద్ర రహదారి, రవాణా శాఖ విడుదల చేసిన 2021 రోడ్డు ప్రమాదాల నివేదిక ఈ విషయాన్ని వెల్లడి చేసింది. ముందు సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో 21,556 ప్రమాదాలు, 8,186 మరణాలు, తెలంగాణలో 21,315 ప్రమాదాలు, 7,557 మరణాలు చోటు చేసుకున్నాయి. 2020తో పోలిస్తే ఏపీలో 2,047, తెలంగాణలో 2,143 ప్రమాదాలు పెరిగాయి.
Telangana State Weekly Current Affairs
1. ఇద్దరు హెచ్‌సీయూ ఆచార్యులకు రాష్ట్రపతి అవార్డులు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాని (హెచ్‌సీయూ)కి చెందిన ఇద్దరు ఆచార్యులను 2021 సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నూతన సాంకేతికత అభివృద్ధిలో అత్యుత్తమ పరిశోధన చేసిన ఆచార్యులకు ప్రతి సంవత్సరం రాష్ట్రపతి విజిటర్ అవార్డులు అందిస్తుంటారు. ఇలా ఏడో విజిటర్ అవార్డులను భౌతికశాస్త్ర విభాగంలో హెచ్‌సీయూ ఆచార్యులు కేసీ జేమ్స్ రాజు, సురజిత్ ధారాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించారు. ఒకే ఏడాది ఇద్దరు హెచ్‌సీయూ ఆచార్యులకు ఈ పురస్కారం లభించడం ఇదే తొలిసారి. గతంలో 2018, 2020లోనూ ఇక్కడి ఆచార్యులకు అవార్డులు దక్కాయి.
జేమ్స్ రాజు 1996లో హెచ్‌సీయూలో ఆచార్యుడిగా చేరారు. అప్పటి నుండి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అనుసంధానంగా పరిశోధనలు చేశారు. 5జీ, రక్షణ రంగాలకు అవసరమైన మైక్రోవేవ్ కమ్యూనికేషన్స్ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఎలక్ట్రికల్లీ ట్యూనబుల్ మైక్రోవేవ్ డివైజెస్ పేరిట వేరాక్టర్స్, రెసోనేటర్స్ పరికరాలు రూపుదిద్దారు. ఇవి ఒక రకమైన సెమీ కండక్టర్లు. ఫెర్రో ఎలక్ట్రిక్ థిన్ ఫిల్మ్స్‌తో రూపొందించారు. సాఫ్ట్‌వేర్ సాయంతో వీటి ధర్మాలను నియంత్రించే వీలుంది. 5జీ సాంకేతికతలో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బ్యాండ్‌కు జేమ్స్ రాజు అభివృద్ధి చేసిన మైక్రోవేవ్ పరికరాలు ఉపయుక్తంగా ఉంటాయి. 2013లో ప్రారంభించిన ఈ పరిశోధనకు డీఆర్డీవో, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహకారం అందించాయి.
సురజిత్ ధారా 2006 నుంచి హెచ్‌సీయూ ఆచార్యుడిగా పని చేస్తున్నారు. లిక్విడ్ క్రిస్టల్స్‌లో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ డిస్‌ప్లేలలో దీన్ని వినియోగిస్తుంటారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్రిస్టల్ డిస్‌ప్లేతో పోల్చితే ఇది ఎంతో వేగం, మన్నిక కలిగి ఉంటుంది. వీటితో పాటు లిక్విడ్ క్రిస్టల్ డ్రాప్లెట్ ఆధారిత ట్యూనబుల్ మైక్రోరెసోనేటర్స్, మైక్రో లేజర్స్‌ను ధారా అభివృద్ధి చేశారు. 2020 సంవత్సరానికి శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని అందుకున్నారు.
2. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది

సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 15వ స్థానం లో నిలిచింది. 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ), సెజ్‌లలో ఉన్న సంస్థలు కలిపి రూ.11,59,210 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయగా అందులో కర్ణాటక (రూ.3,95,904 కోట్లు), మహారాష్ట్ర (రూ.2,36,808 కోట్లు), తెలంగాణ (రూ.1,80,617 కోట్లు), ఆక్రమించాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ 5 రాష్ట్రాల వాటాయే 88.57% మేర ఉండగా, మిగిలినవన్నీ కలిపి 11.43% మాత్రమే. ఇందులో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో నిలిచింది. మొత్తం ఉత్పత్తుల్లో ఏపీ వాటా 0.111%కి పరిమితమైంది. పొరుగున ఉన్న ఒడిశా నుంచి రూ.5,169 కోట్ల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇది ఏపీ కంటే 300% అధికం.
3. తెలంగాణలో అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన నీరు

సగటున ఓ వ్యక్తికి రోజుకు 40 లీటర్ల చొప్పున అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ స్థానం పొందింది. గుజరాత్, గోవా, తెలంగాణ రాష్ట్రాలు వంద శాతం స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 35,988 గ్రామాలకు పూర్తి స్థాయిలో, 12,505 గ్రామాల్లో ఒక్కో వ్యక్తికి 40 లీటర్ల లోపు నీటిని అందిస్తున్నారని తెలిపింది.
4. జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో వ్రితికి రెండు స్వర్ణాలు లభించాయి

జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువతి వ్రితి అగర్వాల్ మొదటి స్థానం లో నిలిచింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోటీల్లో మహిళల 200 మీ. బటర్‌ఫ్లై, 800 మీ. ఫ్రీస్టైల్‌లో ఆమె పసిడి పతకాలు సొంతం చేసుకుంది. 200 మీ. బటర్‌ఫ్లై ఫైనల్లో 2 నిమిషాల 28.13 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచింది. లవ్లీన్ దాస్ (2:43.57 ని), విజయ్‌శ్రీ (3:08.36 ని) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. 800 మీ. ఫ్రీస్టైల్‌లో 9 నిమిషాల 38.78 సెకన్లలో వ్రితి రేసు ముగించింది.
5. జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంతిశ్రీకి రెండు పతకాలు లభించాయి

జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువతి అనుపోజు కాంతిశ్రీ తన ప్రతిభను ప్రదర్శించింది. బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో ఆమె ఓ పసిడి, రజతం సొంతం చేసుకుంది. 14 నుంచి 17 ఏళ్ల వయసు విభాగం పెయిర్ స్కేటింగ్‌లో తేజేష్‌తో కలిసి ఆమె అగ్రస్థానంలో నిలిచింది. సోలో ఫ్రీస్టైల్‌లో ఆమె రెండో స్థానాన్ని దక్కించుకుంది.
6. రిత్విక్ బ్లిట్జ్ టైటిల్ గెలుచుకున్నారు

తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ మరో అంతర్జాతీయ టైటిల్ గెలిచాడు. సన్‌వే సిట్జెస్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అతను విజేతగా నిలిచాడు. చెసబుల్ సన్‌వే సిట్జెస్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్‌లో భాగంగా స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో అతను 9 రౌండ్ల నుంచి 8.5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో 30 దేశాల నుంచి 120 మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు పోటీ పడ్డారు.
7. ప్రముఖ నవలా రచయిత చావా శివకోటి మరణం

పేరు గాంచిన నవలా రచయిత, ఖమ్మం నగరానికి చెందిన చావా శివకోటి 82 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలో 1940 డిసెంబరు 14న జన్మించారు. ఖమ్మం జిల్లాలో మామిళ్లగూడెంలో స్థిరపడ్డారు. శివకోటి తన సాహితీ జీవితంలో 27 నవలలు, 120కి పైగా కథలు రచించారు. 82 ఏళ్ల వయసులోనూ ‘అనుబంధ బంధాలు’, ‘గతించిన గతం’ నవలలను విడుదల చేశారు. సంచిక అనే పత్రికలో నేటికీ ఆయన నవల సీరియల్‌గా ప్రచురితమవుతోంది. ‘సాహితీ-హారతి’ పేరుతో మిత్రుడు డాక్టర్ హరీశ్‌తో కలిసి సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసి ఎందరో సాహితీవేత్తలను సత్కరించారు. యువ రచయితలను ప్రోత్సహించారు. రావిశాస్త్రి, రచన మాస పత్రిక విశిష్టకథా పురస్కారం, త్రిపురనేని గోపీచంద్ స్మారక పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు.
8. బాసరలో 9వ శతాబ్దం నాటి జైన శాసన దేవత శిల్పం గుర్తింపు

బాసరలోని అతి పురాతనమైన కుక్కుటేశ్వర ఆలయంలో ఉన్న జైన శాసన దేవత విగ్రహం 9, 10వ శతాబ్దం నాటిదిగా గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. విగ్రహ శైలిని బట్టి ఇది రాష్ట్ర కూటుల కాలం నాటిదని బృంద కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ప్రతిమ లక్షణాలను బట్టి శాసన దేవత చక్రేశ్వరి. అప్రతిచక్ర, విద్యేశ్వరి అనే పేర్లు కూడా ఉన్నాయి.
9. దినసరి కూలీల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉంది

తెలంగాణలో దినసరి కూలీల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2021లో దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2014 నుంచి 2021 మధ్య 8 ఏళ్ల కాలంలో మొత్తం 23,838 మంది కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2021లో 4,223 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంలో తమిళనాడు (7,673), మహారాష్ట్ర (5,270), మధ్యప్రదేశ్ (4,657) తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది.
ఆంధ్ర రాష్ట్రంలో రోజువారీ కూలీల ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. 2021లో 3,014 మంది కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2014తో పోలిస్తే 2021 నాటికి ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది.
10. ఈట్ రైట్ క్యాంపస్‌గా రామోజీ ఫిల్మ్‌సిటీ కి గుర్తింపు

ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్‌సిటీకి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అత్యుత్తమ రేటింగ్ కింద ఫిల్మ్‌సిటీని ‘ఈట్ రైట్ క్యాంపస్’గా ధ్రువీకరించింది. ఫిల్మ్‌సిటీని సందర్శించే అతిథులు, పర్యాటకులకు జాతీయ ఆరోగ్య విధాన ప్రమాణాలకు లోబడి సురక్షిత, పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించడంతో ‘ఈట్ రైట్ క్యాంపస్’గా ఫిల్మ్‌సిటీ గుర్తింపు సాధించింది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |