Telugu govt jobs   »   Telugu Current Affairs   »   ఆంధ్రప్రదేశ్ లో రూ.1,445 కోట్లతో వ్యర్థాల శుద్ధి

ఆంధ్రప్రదేశ్ లో రూ.1,445 కోట్లతో వ్యర్థాల శుద్ధి

పట్టణ ప్రాంతాల్లో పర్యావరణానికి హానికరంగా మారిన మానవవ్యర్థాలు, మురుగునీటి శుద్ధికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయా వ్యర్థాలను వదిలించుకునేందుకు ఇప్పటిదాకా అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలతో నేల, నీరు, గాలి కలుషితమవుతుండడంతో.. ఇకపై ఆయా వ్యర్థాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రీట్‌మెంట్‌ చేసి సాధ్యమైనంత మేరకు ఎరువులుగా, పునర్‌ వినియోగానికి అవసరమయ్యే రీతిలో మార్చనున్నారు.

దాదాపు రూ.1,445.07 కోట్లతో రాష్ట్రంలోని 74 పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభత్వం నుంచి అనుమతి రావడంతోపాటు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఇటీవల సంబంధిత ఫైలుపై సంతకం కూడా చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ సిద్ధమవుతోంది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ రెండోదశ ప్రాజెక్టులో చేపడుతున్న ఈ యూనిట్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని భావిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గడమేగాక కొన్నేళ్లపాటు నిర్వహణను ఆయా సంస్థలే చేపట్టడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 74 పట్టణ స్థానిక సంస్థలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0లో భాగంగా ఆయా ప్రాంతాల్లో రెండు విభాగాలుగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. మొదటి విభాగంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేసి సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ)కి అనుసంధానం చేస్తారు. అంటే ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చే వ్యర్థజలాలు ఎస్టీపీకి చేరతాయి. ఇక్కడ ఆ నీటిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం వివిధ పద్ధతుల్లో శుద్ధిచేసి మలినాలను వేరుచేసి బయో ఎరువుల తయారీకి తరలిస్తారు.

జలాలను తాగడానికి మినహా ఇతర అవసరాలైన గార్డెనింగ్, పరిశ్రమల్లో వినియోగిస్తారు. రెండో విభాగంలో ప్రతి స్థానిక పట్టణ సంస్థలో ఒక ఫెకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎఫ్‌ఎస్టీపీ) నిర్మించి, సెప్టిక్‌ ట్యాంకుల్లోని మలాన్ని ఆ ప్లాంట్‌లో శుద్ధిచేసి ఘనవ్యర్థాన్ని బయో ఎరువుగా మారుస్తారు. నీటిని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలించి శుద్ధిచేసి పరిశ్రమలకు వినియోగిస్తారు. ఈ రెండు విభాగాలు అనుసంధానమై ఉంటాయి. రెండు విభాగాలను ఏకకాలంలో చేపట్టి, వేగంగా పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం రావడంతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు అప్పగించనున్నారు.

ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను స్థానికంగా ఉండే చెరువులు, నదులకు అనుసంధానించేవారు. ఇక మానవవ్యర్థాలను సెప్టిక్‌ ట్యాంక్‌ల నుంచి సేకరించి సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో పారబోయడం లేదా అండర్‌గ్రౌండ్‌ వ్యవస్థలు ఉన్నచోట నదులకు అనుసంధానం చేయడం వంటి విధానాలు అనుసరించేవారు.

దీనివల్ల నీరు, నేల తీవ్రంగా కలుషితమవుతున్నాయని, ప్రజారోగ్య సమస్య ఉత్పన్నమవుతోందని గుర్తించిన ప్రభుత్వం మురుగును రీసైక్లింగ్‌ చేయడమే ప్రత్యామ్నాయంగా భావించి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. పట్టణాలకు తాగునీటి వనరుగా ఉన్న నదులు, చెరువులను కాలుష్యం నుంచి పూర్తిగా ప్రక్షాళన చేసేదిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మురుగునీటి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో రసాయనాలను ఉపయోగించి 95 శాతం పర్యావరణానికి అనుకూలంగా,  వినియోగానికి అనువుగా మార్చడంతోపాటు అడుగున ఉన్న బయోసాలిడ్‌ (బురద)ను వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే ఎరువుగా మారుస్తారు.

 

***************************************************************************************

ఆంధ్రప్రదేశ్ లో రూ.1,445 కోట్లతో వ్యర్థాల శుద్ధి

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

ఆంధ్రప్రదేశ్ లో రూ.1,445 కోట్లతో వ్యర్థాల శుద్ధి

Download Adda247 App

Sharing is caring!